ఎంత డబ్బు సంపాదించినా ఉండటంలేదా? సంపన్నులు కావాలంటే కుబేరుడి అనుగ్రహం కోసం చెయ్యండిలా!!
చాలామంది ఎంత డబ్బు సంపాదించినా, ఆ సంపాదన నిలబడడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. సంపాదించిన ధనం ఖర్చు అయిపోతుందని, సంపన్నులం కావాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కావడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. ఇక అలా బాధ పడుతున్న వాళ్ళు ఒకసారి ఇంట్లో కుబేర స్థానం ఏమిటో తెలుసుకొని, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని గుర్తించి, తదనుగుణంగా వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే ఐశ్వర్యవంతులు అవడం ఖాయమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కుబేరుడి అనుగ్రహం కావాలంటే దిశల ప్రాధాన్యత తెలియాలి
సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఇంట్లో ఏ దిశలో ఉంటాడు. ఏ విషయాలను మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. వాస్తు శాస్త్రంలో దిశలపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి దిశకు అధిపతిగా ఒక దేవుడు ఉంటాడు. ఇంటిని వాస్తు దోషాలు లేకుండా ఉంచుకోవాలంటే దిక్కులు చూసుకోవాలి. ఏ దిక్కులో కూడా సామాన్లను కుప్పగా పెట్టకూడదు. ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన దిశ ఉంటుంది.

ఉత్తర దిశకు అధిపతి ఐశ్వర్య దేవుడు కుబేరుడు.. ఆ దిశలో వాస్తు దోషం ఉంటే కష్టమే
ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే, సంపాదన నిలవాలంటే ఇంటికి ఉత్తర దిశకు అధిపతి అయిన ఐశ్వర్య దేవుడు కుబేరుడి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి అందుకే చాలామంది ఉత్తరం వైపు ఇంటి నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటి ఉత్తర దిశలో వాస్తు దోషం లేకుంటే ఇంట్లో ఐశ్వర్యం, సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ఈ దిశలో వాస్తు దోషం ఉంటే, ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఉత్తరం దిశగా ఉంటె వాస్తు దోషాలు .. ఇవి ఉంటే డబ్బు, మనశ్శాంతి ఖాళీ
ఉత్తరం వైపు ఉన్న ఇంటి తలుపు తూర్పు వైపు కాకుండా పడమర దిశలో ఉంటే, ఈ ఇంటి వ్యక్తులు ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేరని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఇంటి యజమాని డబ్బు కోసం ఇంటి బయట ఎక్కువ సమయం గడుపుతారు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక వాయువ్య దిశలో ప్రధాన ద్వారం దగ్గర వాటర్ ట్యాంక్ లేదా బోరింగ్ వాస్తు దోషాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అలాంటి ఇంట్లో నివసించే స్త్రీల మనస్సు చంచలంగా ఉంటుందని , ఇంట్లో వారు తక్కువగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు దోషాలతో దొంగతనాలకు, ఆందోళనలకు ఛాన్స్
వాయువ్య దిశలో ప్రధాన ద్వారం దగ్గర వాటర్ ట్యాంక్ లేక బోర్ ఉంటే ఆ ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఉత్తరం వైపు ఉన్న భూమిలో నిర్మించబడిన ఇంట్లో ఎప్పుడూ పశ్చిమ దిశను ఖాళీగా ఉంచకూడదని నమ్ముతారు. ఒకవేళ అలా పశ్చిమదిశ ఖాళీగా ఉంచితే దీని వల్ల పురుషులు శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తూర్పు-ఉత్తరంలో భూగర్భ నీటి ట్యాంక్... బలమైన ఆర్ధిక స్థితికి సంకేతం
ఇంటికి ఉత్తర దిశలో పూజా గృహం లేదా అతిథి గది ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో వంటగదిని నిర్మించడం ద్వారా, ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి ఉత్తరం గోడ పగలకూడదని, పగుళ్లు రాకూడదని నమ్ముతారు.దీంతో కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎల్లప్పుడూ తూర్పు-ఉత్తరంలో భూగర్భ నీటి ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే ఇది ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఇక అంతే కాదు ఇంటికి ఉత్తరం దిశగా ఎటువంటి చెత్త వేయకూడదని, ఉత్తరదిశలో మర్చిపోయి కూడా మూత్ర విసర్జన వంటివి చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఉత్తరం వైపు వాస్తు నియమాలు పాటిస్తే కుబేరుడి అనుగ్రహం తప్పక ఉంటుంది
ఈ వాస్తు నియమాలను జాగ్రత్తగా పాటిస్తే ఉత్తర దిశకు అధిపతి అయిన కుబేరుడు అనుగ్రహం తప్పక వారిపై ఉంటుందని తెలుస్తుంది. ఇంకేం మరింత జాగ్రత్తగా ఉత్తర దిశకు అధిపతి అయిన ఐశ్వర్య దేవుడు కుబేరుడి అనుగ్రహం కోసం వాస్తు నియమాలను పాటించి, సిరి సంపదలతో తులతూగేందుకు, ఐశ్వర్యవంతులు అయ్యేందుకు రెడీ అయిపోండి.












Click it and Unblock the Notifications