
కార్తీక మాసం ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి?
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
" న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః "
శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం :- జ్యోతిషశాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలవబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro Magnetic Activity" అంటారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరుచెప్పి కార్తీకం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెలరోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే మరి. స్నానం అనేది శరీర శుభ్రత కోసం. ఆరోగ్యాన్ని కోపాడుకోవడంలో ఇదో భాగం. అయితే నిత్యం చేసే స్నానం వేరు కార్తీకమాసంలో చేసే స్నానం వేరంటారు మన పెద్దలు.

కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి :- ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మిణుకు మిణుకు మంటుండగానే కార్తీకమాసంలో నదీస్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి, కార్తీకం నెలరోజులూ సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది.
ఆరోగ్య రక్షణ కోసం నెలరోజుల నియమం సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు.
మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం కార్తీకమాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు.. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నదివరకూ నడవాలి. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. స్వచ్ఛమైన నీరుండే సమయం ఇదే నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే అనువైనసమయం.
కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి , శుభ్రమైన దుస్తులు ధరించి తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.
కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి , సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

కార్తీక శుద్ధపాడ్యమి:- తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయాని వెళ్ళి , నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ:- ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ:- అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.
చవితి:- కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి 'పుట్టకు' పూజ చేయాలి.
పంచమి:- దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్టి:- ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
సప్తమి:- ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది.
అష్టమి:- ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.
నవమి:-ఈ రోజు నుండి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి:- ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి:- ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.
ద్వాదశి:- ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.
త్రయోదశి:- ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.
చతుర్దశి:- పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.
కార్తీక పూర్ణిమ:- మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.
కార్తీక బహుళ పాడ్యమి:- ఈ రోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం.
విదియ:- వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.
తదియ:- పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.
చవితి:- పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
పంచమి:- చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.
షష్ఠి:- గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది.
సప్తమి:- జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.
అష్టమి:- కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి ( కుక్కకు ) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి:- వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి:- ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరతాయి.
ఏకాదశి :- విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం.
ద్వాదశి :- అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.
త్రయోదశి :- నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.
చతుర్దశి :- ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.
అమావాస్య :- నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయం పాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.
ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు , ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.
కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో , పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.