నింగిలోకి ఎగిరిన టాటా-ఎయిర్‌బస్. క్రేజీ ప్రాజెక్ట్ సక్సెస్!
భారత ఏరోస్పేస్ , రక్షణ తయారీ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 'మేక్ ఇన్ ఇండియా' స్వప్నాన్ని సాకారం చేస్తూ, దేశీయంగా అసెంబుల్ చేసిన మొదటి 'Airbus C-295' సైనిక రవాణా విమానం గుజరాత్‌లోని వడోదర నుంచి తన తొలి ప్రయాణాన్ని (Maiden Test Flight) విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతున్న భారత అసాధారణ సామర్థ్యానికి నిదర్శనమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఈ అద్భుత విజయాన్ని సాకారం చేసిన ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందాలతో పాటు రాత్రింబగళ్లు శ్రమించిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కార్మికులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రూ. 29,000 కోట్ల మెగా ప్రాజెక్ట్
భారత రక్షణ శాఖ, గ్లోబల్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ సంస్థల మధ్య 2021లో కుదిరిన 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 29,000 కోట్లు) ఒప్పందంలో వడోదర ప్లాంట్ అత్యంత కీలక కేంద్రంగా మారింది. 2024 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సంయుక్తంగా ఈ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఫెసిలిటీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ మెగా డీల్ ప్రకారం మొత్తం 56 విమానాలలో.. 16 విమానాలు స్పెయిన్ నుండి నేరుగా 'ఫ్లై-అవే' కండిషన్‌లో భారత్‌కు అందుతాయి. మిగిలిన 40 విమానాలను పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికత, భాగస్వామ్యంతో వడోదర ప్లాంట్‌లోనే అసెంబుల్ చేయనున్నారు. 2031 నాటికి ఈ విమానాల డెలివరీలు పూర్తిగా పూర్తి కానున్నాయి.

'An-32' స్థానంలో శక్తివంతమైన ప్రత్యామ్నాయం
భారత వైమానిక దళం (IAF) వద్ద 1980ల నాటి నుండి సేవలందిస్తూ, ప్రస్తుతం పదవీ విరమణకు చేరువైన పాత 'An-32' రవాణా విమానాల స్థానంలో సీ-295 అడుగుపెడుతోంది. పాత విమానాల పేలోడ్ సామర్థ్యం కేవలం 6,700 కిలోలు మాత్రమే కాగా.. ఈ సరికొత్త సీ-295 విమానం ఏకంగా 9,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు.
దీనివల్ల ఒకేసారి ఎక్కువ మంది సైనికులను, భారీ యుద్ధ పరికరాలను సరిహద్దులకు వేగంగా తరలించవచ్చు. కేవలం రవాణాకే పరిమితం కాకుండా.. సముద్ర తీర గస్తీ, నిఘా నేత్రం , అత్యవసర వైద్య సహాయక మిషన్లను సైతం నిర్వహించగల బహుళ ప్రయోజన సామర్థ్యం దీని సొంతం. అంతేకాకుండా, విమానాల నిర్వహణ కోసం భారత్‌లోనే అత్యాధునిక 'MRO' (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
నౌకాదళం, కోస్ట్ గార్డ్ నుంచి అదనపు ఆర్డర్లు
ఈ విమానాల సామర్థ్యంపై నమ్మకంతో, ప్రాథమికంగా కుదుర్చుకున్న 56 విమానాల ఆర్డర్‌కు అదనంగా.. మరో 15 సీ-295 విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దాదాపు 3.1 బిలియన్ డాలర్ల విలువైన ఈ అదనపు ఆర్డర్‌లో.. 9 విమానాలను భారత నావికాదళం (Indian Navy) కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఇవి నౌకాదళం వద్ద ఉన్న పీ-8ఐ (P-8I) విమానాలతో కలిసి సముద్ర గస్తీ బాధ్యతలను పంచుకోనున్నాయి. మిగిలిన 6 విమానాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) తీరప్రాంత రక్షణ మిషన్ల కోసం ఉపయోగించనుంది.
స్వదేశీ రక్షణ తయారీ రంగానికి కొత్త ఊపు
ఈ సీ-295 ప్రోగ్రామ్ భారత రక్షణ రంగ ఉత్పత్తి వ్యవస్థను సంపూర్ణంగా మార్చేసింది. ప్రస్తుతం ఈ విమానానికి సంబంధించిన దాదాపు 13,400 విడిభాగాలు , 4,600 సబ్-అసెంబ్లీలు స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారవుతున్నాయి. గతంలో స్పెయిన్‌లో జరిగిన పనులలో ఏకంగా 96 శాతం పనులను ఇప్పుడు వడోదర ప్లాంట్‌లోనే విజయవంతంగా పూర్తి చేస్తుండటం విశేషం.
భవిష్యత్తులో వైమానిక దళం చేపట్టబోయే 'మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్' (MTA) ప్రోగ్రామ్‌లో కూడా ఈ స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. సరిహద్దుల్లో సైనిక అవసరాలను తీరుస్తూనే, ఏరోస్పేస్ తయారీ రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక సరికొత్త దిశను నిర్దేశిస్తోంది.
Exciting to see the first Made in India Airbus C295 complete its maiden test flight from Vadodara.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 11, 2026
This is more than just an aircraft taking to the skies, it is also a reflection of India’s growing capabilities in aerospace manufacturing and our journey towards becoming a global… pic.twitter.com/tGWSZippgF














Click it and Unblock the Notifications