• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారతంలో భీష్ముడి పాత్ర ఏంటి..? భీష్మాష్టమి ప్రశస్తత ఏమిటి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శుక్ల పక్షాస్య చాష్టమ్యాం మాఘ మాసస్య పార్ధివ

ప్రాజాపత్యేచ నక్షతే మధ్యం ప్రాప్తే దివాకర

పై శ్లోకం ఆధారంగా భారత యుద్ధం ప్రారంభించి పది రోజుల వరకు భీష్ముడు యుద్ధం చేసి పితృదేవతా నక్షత్రమైన అశ్విని నక్షత్రం రోజున పడిపోయాడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉండటం చేత ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉన్నాడు. భీష్మనిర్యాణము సమయం ఆసన్నమైనది అని గుర్తుచేస్తూ ఓ ధర్మరాజ సూర్యుడు ఉత్తరగతిని పొందినాడు .ఈ మాఘమాసం ప్రారంభించి శుక్లపక్షం ఇంకా మూడు భాగాలు మిగిలి ఉన్నది. అని చెప్పడం వలన ఆరోజు మాఘశుద్ధ సప్తమి సూర్యని ఉత్తరాయణ ప్రవేశ కాలమని పై శ్లోకం తెలియజేస్తుంది.

మాహాభారత కాలంలో మాఘ సుద్ధ సప్తమినాడు అనగా రధసప్తమి లేక సూర్య సప్తమి సూర్యునిరధం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని అయన గతి మారేదని తెలుస్తుంది. మర్నాడే మాఘ శుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అని అంటారు. భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు. సరిగ్గా నేటి పరిస్థితికి 5056 సంవత్సరాలకు అవుతుంది. అనగా మహాభారత యుద్ధకాలం క్రీస్తు పూర్వం 3138 సంవత్సరాలకు జ్యోతిషుల లెక్కలకు సరిపోతుంది. దీని గురించి నా పి.హెచ్ డి గ్రంధంలో వివరంగా తెలియజేశాను.

What is the Role of Bheeshma in Mahabharat

భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన "మహోగ్రశిఖర ఘన తాళతరువగు సిడము వాడు" - అంటే ఆయన ధ్వజం గుర్తు తాటిచెట్టు. దానిలాగే వందలాది భారత పాత్రలలో అండరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి, కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కాని, భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారే మో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా, తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.

శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించక పోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు. అందుకే ఆయనను మహాభక్తుల కోవలో పరిగణించారు విజ్ఞులు, "ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీశ, శుక, శౌనక, భీష్మ దాల్భ్యాన్" అంటూ. అంతే కాదు, ఆయన మహా విజ్ఞాని. ఎన్నో ధర్మాలు తెలుసు ఆయనకు! రాచకార్యాల్లో తలమునకలు కాని సమయమంతా అధ్యయనం లోనే గడిపి ఉంటాడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. ఇక పద్యంలోకి వద్దాం.

అటువంటి పరిపూర్ణ పురుషుడైన భీష్ముడు తన ఆఖరు క్షణాలలో పాండవుల తో కలిసి తనను పరామర్శించ డానికి వచ్చినపుడు, ఎంతో పారవశ్యంతో శ్రీకృష్ణుని స్తుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు. మామూలు సన్నివేశమా అది! కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలుపెడుతున్నాడుఅర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు.

కేవలం అర్జునుని ఉత్సాహ పరచడానికే కాక, భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. భీష్ముని చంపడానికి ముందుకు కాలు సారించాడు. మామూలు సైనికులందరూ దూకబోయే పులిని చూసిన లేళ్ళలాగా చెల్లా చెదరైనారు. కౌరవులందరూ నిలుగు గుడ్లేసుకుని చూస్తున్నారు. భీష్ముడు ఏమాత్రమూ తొట్రుపాటు లేకుండా, మిక్కిలి ప్రియంగా, రావయ్యా, వేగంగా వచ్చి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యవయ్యా అని వేడుకున్నాడట (ఇది తిక్కన వర్ణన, కింద చిత్రాన్ని చూడండి). పోతనగారి భీష్ముడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి కనుల ముందుకు తెచ్చుకున్నాడు పైపద్యంలో.

నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండ లాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును (పాదాన్ని కాదు)

పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ, తన చాలిమిని ఎత్తిచూపినందువల్ల కలిగిన అవమానంతోనూ, నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు.

ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ 'ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ' ముందుకొస్తున్న ఆ మహానుభావుడు నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు నాకు దిక్కగుగాక! అని స్తుతించిన సందర్భంలోనిది ఈపై పద్యం. ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన, తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ, ఆ చేలాంచలం జారడం లోని సొగసూ, ఆ చక్రమూ, కాలుక్కరచుకున్న అర్జునుడూ, అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు, ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో, పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది, ఎవరికి నచ్చదు!

ఇంకొక చిత్రం ఉన్నది ఈ సందర్భంలో. అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులూ, కృష్ణుడూ వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం, "సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబు లేను విడుతు నందాక నిదె మంధాసుడై, వికసిత వదనార విందుడై వచ్చి నేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు, మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి జేసితినొ పుణ్యమితని గూర్చి" అని అంటాడు. ఆ మహాత్ముని కంటే ధన్యులెవరుంటారు.

English summary
The role of Bhishma in the epic of Mahabharat is a key one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more