వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశీ ఆలయం విశిష్టత ఏమిటి.. ప్రతి హిందువు కాశీని ఎందుకు సందర్శించాలి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

విశ్వేశ్వరా విరూపాక్ష
విశ్వరూప సదాశివ
శరణం భవ భూతేశ
శంకర కరుణాకర
హర హర మహాదేవ
శంభో సర్వోత్తమ
నీలకంఠ నమోస్తుతే

కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో..? సముద్రంలో నీటి బిందువు లాంటి ఈ సంక్షిప్త సమాచారం తెలియజేయడం జరుగుతుంది. హిందువులు జీవితంలో ఒక్క సారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి. ఈ క్షేత్ర దర్శనం వలన బ్యాహా సౌందర్యం దృశ్యాల కంటే కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవుతుంది. చిత్త శుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి , ఆత్మా జ్ఞానం కలిగిస్తుంది.

kashi vishwanath kshetram temple and significance important places to visit

1. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ క్షేత్రం అనేది బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం.

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం.

4. స్వయంగా శివుడు నివాస ముండే నగరం.

5. ప్రళయకాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పై కెత్తి కాపాడతాడు.

6. కాశీ భువి పై ఉన్న సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ ద్వాదశ జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

8. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి,
కాలభైరవ దర్శనము ఇక్కడ అతి ముఖ్యం.

9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

10. కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్పి పునర్జన్మ అంటు ఉండదు.

11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది అని పెద్దలు చెబుతారు.

12. డిండి గణపతి, కాలభైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు.

13. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరవాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీ దారం కడతారు.

14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి దశ జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

17. మరణించిన వారి ఆస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

18. గో ముఖం నుండి బయలు దేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీ లోని కొన్ని వింతలు :-

kashi vishwanath kshetram temple and significance important places to visit

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు, గొందులు కలిగి ఆ సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి
ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికి జాడ దొరక కుండా ఉంటుంది.

3. ఇక్కడ అనేక సుందరవనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడు కోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్య పోయారు.

5. అసలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి.

6. అప్పటి పూర్వీకులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి.

8. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు .

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథున్ని అభిషేకించిన తరవాత భక్తుల చేతి రేఖలు మారి పోతాయి అంటారు.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ.

13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీ లోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి అందులో కొన్ని :-

1) దశాశ్వమేధఘాట్:- బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయంకాల సమయంలో విశేషమైన గంగా హారతి జరుగుతున్నది. ఈ హారతి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఎంతటి వారికైనా ఇక్కడ భక్తి పరవళ్ళు తొక్కుతుంది.

2) ప్రయాగ్ ఘాట్:- ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:- చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:- సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:- పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:- ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు.
ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విశ్వేశ్వర్ ఘాట్:- ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవున్ని దర్శిస్తారు.

8) పంచగంగా ఘాట్:- ఇక్కడే భూ గర్భం నుండి గంగలో ఐదు నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:- ఇక్కడ గోపూజ జరుగుతుంది.

10) తులసి ఘాట్:- తులసిదాస్ సాధన చేసి రామచరితమానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది స్థలం.

11) హనుమాన్ ఘాట్:- ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం ఉన్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సిఘాట్:- పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపిన ఖడ్గంను ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా ఉద్బవించింది.

13) హరిశ్చంద్రఘాట్:- సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం చేసే కూలీగా పని చేసి, దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు, ఈ రోజు వరకు కుడా ఇక్కడ ఎప్పుడు శవాలను కాలుస్తూ ఉంటారు.

14) మానససరోవర్ ఘాట్:- ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:- నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సిఘాట్:- ఇక్కడే స్కంధ పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ఇష్టమైన స్థలం, ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి అంటారు.

17) రానామహల్ ఘాట్ :- ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్ :- ఈమె కారణం గానే మనం ఈ రోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీ లోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయుల దండ యాత్ర కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసినారు ఎంతో సుందరంగా ఉండే క్షేత్రాన్ని విద్వంసం చేయగా మిగిలిన కాశీని ప్రస్తుతం మనం చూస్తున్నా కాశీ.
విశ్వనాథ, బిందు మాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చివేసి అదే స్థలంలో మసీదులు నిర్మించినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు. కాశీ స్మరణం మోక్షకారకం. కాశీ పుణ్యక్షేత్రం గురించి, ఇక్కడి మహత్యాల గురించి స్వయంగా అనుభవిస్తే తప్ప చెబితే అర్ధం అయ్యేది కాదు. కాశీ విశాలాక్షి విశ్వేశ్వర, అన్నపూర్ణాదేవి, కాలబైరవ స్వామి అనుగ్రహం సదా మీకు కలగాలని కోరుకుంటూ శీఘ్రమేవ కాశీ దివ్యక్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు తదాస్తూ...

కాశీ విశ్వనాధాష్టకం:-

గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయనః ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||

ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

English summary
kashi vishwanath kshetram temple and significance important places to visit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X