అయోధ్య జాతీయఉద్యమం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సాగుతున్న రామజన్మభూమి ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా సీనియర్ బిజెపి నేత, కేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీ అభివర్ణించారు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడంలోకి కరసేవకులు ప్రవేశించారన్న వార్త విని ఆనందంతో తాను ఉప్పొంగిపోయానని, అవి తాను జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలని 1990 అక్టోబర్ 30 నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆయన తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిణామాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ లిబర్‌హన్ కమిషన్‌ముందు బుధవారం నాడు అద్వానీ వాంగ్మూలం ఇచ్చారు. కమిషన్ ముందు ఆయన హాజరుకావడం ఇది అయిదోసారి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న ములాయంసింగ్ యాదవ్ సృష్టించిన అవరోధాలన్నీ అధిగమించి కరసేవకులు వివాదాస్పద కట్టడంలోకి ప్రవేశించిన వార్తను రేడియోలో విని తాను ఆనందంతో ఉప్పొంగిపోయానని అద్వానీ తెలిపారు.
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం చుట్టూ వున్నా 67 ఎకరాల స్థలం స్వాధీనానికి అప్పటి ప్రధాని విపిసింగ్ ఆర్డినెన్స్ జారీ చేసి 24 గంటల్లోనే దానిని ఉపసంహరించడం సమస్య పరిష్కారానికి మార్గాలను మూసివేసిందని అద్వానీ అన్నారు.మైనార్టీలను బుజ్జగించడానికే విపిసింగ్ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించారని ఆయన ఆరోపించారు. అయితే విపిసింగ్ చర్య వల్ల మైనార్టీలకు కూడా ఎటువంటి ప్రయోజనం కలగలేదని ఆయన అన్నారు.
వివాదాస్పద కట్టడంలో రామాలయం వున్నదా లేదా ఆనే విషయం కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారని అద్వానీ చెప్పారు. ఆర్డినెన్స్ అమలులోకి వచ్చివుంటే రామజన్మ భూమి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయ్యేదని ఆయన చెప్పారు. ఆర్డినెన్స్‌ను బిజెపి ఆహ్వానించిందని అయితే విశ్వహిందూపరిషత్ సాధువులు మాత్రం వ్యతిరేకించారని ఆయన అంగీకరించారు.












Click it and Unblock the Notifications