భారీ ఎత్తున బాబు ప్రచారం
హైదరాబాద్:రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని వున్న రాజకీయ వాతావరణం దృష్ట్యా రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏలాంటి అవకాశం ఇవ్వరాదని తెలుగుదేశం నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారం మునుపెన్నడూ లేని విధంగా ముమ్మరంగా జరపాలని ఆయన నిర్ణయించారు.
ఈ నెల 30న తిరుమలలో తొలుత స్వామిని దర్శించుకుని అక్కడినుంచే ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యక్రమం రూపొందించుకున్నారు. తిరుమలలో స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుపతి ఎస్వీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు మధ్నాహ్నం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కొల్లిపర గ్రామంలోని బహిరంగ సభలో పాల్గొంటారు.
ఒకటో తేదీన కర్నూలు జిల్లా బనగానపల్లెలో నిర్వహించే సభలో పాల్గొంటారు. రెండో తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆడియో, విడియో సాధనాలను తెలుగుదేశం ఉపయోగిస్తున్నది. సినీదర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటల కాసెట్‌ను విడుదల చేస్తున్నారు. సినీనటి రోజా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications