పేటలో మందుపాతర-పదిమంది మృతి
గుంటూరుః గుంటూరు జిల్లా నరసరావుపేటలో మందుపాతరపేలి ఓ ఎస్.ఐ. సహా పదిమంది పోలీసు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్ సందర్భంగా సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.పీపుల్స్ వార్ నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నరసరావుపేట సమీపంలోని రెమిడిచెర్ల వద్ద అమర్చిన మందుపాతరకు మొబైల్ స్క్వాడ్ తొమ్మిదిమంది పోలీసులు, ఒక డ్రైవర్ బలయ్యారు.
బందోబస్తు పరిస్థితిని సమీక్షించేందుకు మొబైల్ స్క్వాడ్ పోలీసులు ప్రత్యేక వాహనంలో గస్తీ తిరుగుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. మందుపాతరపేలిన సమయంలో వాహనంలో 12 మంది వున్నారు. డ్రైవర్ తో సహా పదిమంది అక్కడికక్కడే మరణించగా ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నెల 14 నుంచి జరుగుతున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఇంత భారీస్థాయిలో హింసాత్మక సంఘటన చోటుచేసుకోవడం ఇదే ప్రథమం.
ఇంతకాలం తెలంగాణా జిల్లాలకే పరిమితమైన మందుపాతరల సంస్కృతి కోస్తా జిల్లాలకు వ్యాపించడం గమనార్హం. కోస్తా జిల్లాలలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు ఈ మధ్య కాలంలో ముమ్మరం అయ్యాయి. అయితే ఇంతవరకు మందుపాతర సంఘటనలుపెద్దగా చోటు చేసుకోలేదు. పోలీసు బందోబస్తు మ్ముమ్మరంగా వుండే ఎన్నికల సమయంలో నక్సలైట్లు ఇంతటి దుస్సాహసానికి పాల్పడడంవిశేషం.












Click it and Unblock the Notifications