కాంగ్రెస్, వామపక్షాల ఐక్య ఉద్యమం
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కలిసికట్టుగా ఉద్యమించాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహించుకున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పోలీసు కాల్పుల్లో మరణించిన ముగ్గురిని స్మరిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్, వామపక్షాల ప్రదర్శనలో ఆ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద తొమ్మిది వామపక్షాలు ప్రదర్శన నిర్వహించి అమరులకు నివాళులర్పించాయి. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు కొనసాగిస్తోందని, ఇవి ప్రజలకు కీడు చేసే సంస్కరణలని వామపక్షాల నాయకులు అన్నారు. తాగునీటిని, సాగునీటిని, విద్యను, తదితర రంగాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్‌పరం చేస్తూ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం వున్నదని సిపిఎం నాయకుడు కొరటాల సత్యనారాయణ అన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జగజీవన్‌రామ్ విగ్రహం వద్ద సభ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.
నగరం నడిబొడ్డున వున్న బషీర్‌బాగ్ చౌరస్తాలో మూడు నిండు ప్రాణాలను సర్కారు తుపాకులు దిగమింగి నేటికి ఏడాది కావస్తున్నది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజున విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షపార్టీలు కాంగ్రెస్ కలసి నిర్వహించిన భారీ ర్యాలీపై పోలీసులు విచక్షణరహితంగా కురించిన గుళ్లవర్షానికి ముగ్గురు బలైన విషయం విదితమే.
విష్ణువర్దన్‌రెడ్డి(సిఐటియు), బాలస్వామి (కాంగ్రెస్), ఎస్ రామకృష్ణ(సిపిఐ) ఈ కాల్పుల్లో మరణించగా మరో పాతిక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా బషీర్ బాగ్ చౌరస్తాలో తొమ్మిది వామపక్ష పార్టీల నేతృత్వంలో మంగళవారం నాడు భారీ ర్యాలీ జరిగింది. అమరవీరులకు జేజేలు పలకుతూపెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ చౌరస్తాలో అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటుకు వామపక్ష పార్టీలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దేశసార్వభౌమాధికారాన్ని తాకట్టుపెట్టి ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వామపక్ష నేతలు దుయ్యబట్టారు. సంస్కరణలపేరిట సాగుతున్న దోపిడిని అడ్డుకోవడానికి తాము ప్రజలను కూడాగట్టి ముందుకు కదులుతామని వారు ప్రకటించారు.విద్యత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ ముగ్గురు యువకులు ప్రాణదానం చేసినా ప్రభుత్వంలో చిన్నపాటి కదలిక కూడా లేదని వారు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications