కొలిక్కి రాని ఆర్టీసి చర్చలు
హైదరాబాద్: ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితికి మధ్య జరుగుతున్న చర్చలు బుధవారం సాయంత్రానికి కూడా ఒక కొలిక్కి రాలేదు. అటు ప్రభుత్వం గానీ, ఇటు జెఎసి గానీ ఏ మాత్రం పట్టువిడుపుల ధోరణిప్రదర్శించకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. మంగళవారం మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులకు, జెఎసి ప్రతినిధులకు మధ్య రెండు దఫాలు చర్చలు జరిగాయి. బుధవారం సాయంత్రం మూడో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. వేతన సవరణవిషయంలోనూ, మోటారు వాహనాల పన్ను విషయంలోనూ ప్రభుత్వం ఏ మాత్రం దిగి రావడం లేదని జెఎసి కన్వీనర్ బి. రామారావు చెప్పారు.
ఆర్టీసి సమ్మె బుధవారం 17వ రోజుకు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. హైదరాబాద్‌లో వామపక్షాల కార్యకర్తలు ప్రయివేట్ బస్సులను అడ్డుకున్నాయి. ఆర్టీసి కార్మికులుఅర్థనగ్న ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వద్ద ట్రాఫిక్‌ను అడ్డుకోవడానికి రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండలో కాంగ్రెస్, వామపక్షాలు ఎక్కడి బస్సులను అక్కడే అడ్డుకున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సిపిఎం నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళంలో ఆర్టీసి కార్మికుల కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. వరంగల్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులను పోలీసులు బుధవారం కోర్టులోహాజరు పరిచారు. ఈ అరెస్టులను నిరసిస్తూ ఆర్టీసి కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా గుంటూరులో ఆటోల ప్రదర్శన జరిగింది. నెల్లూరులో రాస్తారోకో జరిగింది. తిరుపతిలో ఆర్టీసి కార్మికులు ప్రారంభించిన రిలే నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications