శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని ఒక మసీదులోకి చొరపడి గత 24 గంటలుగా మసీదును ఆక్రమించుకున్న ఇద్దరు జమైత్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులను భద్రతా దళాలు ఎట్టకేలకు కాల్చిచంపాయి.
శుక్రవారం నాడు టుటిగండ్ గ్రామంలో గస్తీ తిరుగుతున్న భద్రతా దళం జవాన్లకు ఎదురుపడిన తీవ్రవాదులు కొద్దిసేపు ఎదురుకాల్పుల తర్వాత పారిపోయి గ్రామంలోని మసీదులో తలదాచుకున్నారు. భద్రతాదళాలు మసీదును వెంటనే చుట్టుముట్టి లొంగిపోవల్సిందిగా ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ తీవ్రవాదులు చెవినపెట్టలేదు. మధ్యవర్తులుగా వచ్చిన మసీదు ఇమామ్‌తో సహా నలుగురు ఊరిపెద్దలను కూడా కొన్ని గంటలపాటు నిర్భందించి చివరకు వదిలేశారు. శుక్రవారం రాత్రంతా హోరాహోరీగా కాల్పులు జరిపారు. శనివారం వేకువజామున భద్రతాదళాలు మసీదులోకి చొరబడి తీవ్రవాదులను కాల్చిచంపాయి. ఈ ఘర్షణలో ఒక పౌరుడు కూడా మరణించాడు. మరణించిన ఉగ్రవాదులను అబూ దానియల్, షబ్బీర్‌గా గుర్తించారు.వీరిద్దరూ పాకిస్తాన్‌లోని సియల్‌కోట్ ప్రాంతానికి చెందినవారు.