న్యూఢిల్లీః వచ్చే నెలలో కజఖ్‌స్తాన్‌లో జరుగునున్న ఒక అంతర్జాతీయ సదస్సులో భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ పరస్పరం ఎదురుపడనున్నారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య లాంఛనంగా సమావేశం జరిగే అవకాశం మాత్రం లేదు.
ఒకే వేదికపై వాజ్‌పేయి, ముషారఫ్ పాల్గొనడం గతఆయిదునెలల్లో ఇదే మొదటిసారి. అయిదు నెలల క్రితం నేపాల్‌లో జరిగిన సార్క్ సమావేశంలోవీరిద్దరు పాల్గొన్నారు. కజఖ్ రాజధాని అల్మాటిలో జరుగుతున్నకాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఆసియా సదస్సులో భారత్, పాకిస్తాన్‌తో పాటు రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలుఘోరంగా క్షీణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు ఎదురుపడటానికి అంతర్జాతీయవిశ్లేషకులు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.