హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌పై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, ఇది చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కరవు నుంచి క్రీడల నిర్వహణ వరకు అన్నింటినీ విమర్శించడమే కాంగ్రెస్ సంప్రదాయంగా మారిందని, ఈ విమర్శల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని ఆయన అన్నారు. జాతీయ క్రీడల నిర్వహణ విషయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కల్మాడి ప్రశంసించడంపై కూడా కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరమని, తమ పాలనలో బాగా చేశామని కాంగ్రెస్ చెప్పుకోవచ్చునని, అందుకు విరుద్ధంగా విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కరువు వల్ల 5,300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. జాతీయ క్రీడల్లో మాదిరిగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టీమ్ స్పిరిట్‌తో పని చేయాలని ఆయన సూచించారు.