పరిటాల హత్యతో నాకే సంబంధం లేదు: భానుమతి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మద్దెలచెర్వు సూరి భార్య, పరిటాల రవి హత్య కేసులో నిందితురాలు, అనంతపురం జిల్లా పెనుకొండ కాంగ్రెస్ నాయకురాలు గంగుల భానుమతి అన్నారు. ఆమె శుక్రవారం నాగులూరు గ్రామంలోని తన బంధువుల ఇంటిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అనంతపురం రాజీవ్‌నగర బాట సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని తాను కలవడాన్ని ఆమె సమర్థించుకున్నారు. గత ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇచ్చారని, ముఖ్యమంత్రికి అందరూ సమావమేనని ఆమె అన్నారు. తాను వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతం కావడం చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీవారు తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె విమర్శించారు.
పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నంత మాత్రాన దోషులు కారని, దోషులెవరనేది ఏదో ఒక రోజు బయటపడుతుందని ఆమె అన్నారు. అందరు కార్యకర్తల్లా తాను ముఖ్యమంత్రి రాజీవ్ నగరబాటలో పాల్గొన్నానని ఆమె చెప్పారు. నగరబాట సందర్భంగానే కాదు, ఎప్పుడైనా రా అమ్మా! అంటూ ముఖ్యమంత్రి తనను ఆహ్వానిస్తారని ఆమె చెప్పుకున్నారు. పరిటాల రవిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడు పక్కన కూర్చోబెట్టుకుని బలపరచలేదా అని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
