చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి అసాధ్యం: వైయస్
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధి అసాధ్యమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెనకబాటుతనం వల్లనే రాష్ట్ర డిమాండ్ ముందుకు వస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటవుతుందో లేదో, తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు గానీ వచ్చే నాలుగేళ్లలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకొని ప్రజల విశ్వసనీయతను పొందితే రాష్ట్ర డిమాండ్ ఉండదని ఆయన అన్నారు.
ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు ప్రాంతీయ బోర్డులను పునరుద్ధరించే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రంలో వనరులు, ఆదాయాలు తగ్గుతాయని, పెద్ద రాష్ట్రాల్లో ఆదాయవనరులు ఎక్కువగా ఉంటాయని, ఈ ఆదాయ వనరులను వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎక్కువ కఱ్చు పెట్టడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రమే ఉండాలని మజ్లీస్, మైనార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయని, ఒక వేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే వాదన వారి నుంచి వస్తోందని ఆయన అన్నారు. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలోనే తమ హక్కులకు రక్షణ ఉంటుందని మైనారిటీలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications