ఇండియా కూటమిలోకి విజయ్ ? డీఎంకే కు కాంగ్రెస్ ఘాటు కౌంటర్లు..!
తమిళనాడులో గత ఎన్నికల ఫలితాల తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలు జాతీయ స్ధాయిలో ప్రభావం చూపించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమిపాలైన స్టాలిన్ పార్టీ డీఎంకే (DMK) నడుపుతున్న కూటమిని వదిలి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ (Congress) వ్యూహాత్మక అడుగు వేసింది. దీంతో దాదాపు ఆరు దశాబ్దాల తమిళనాడు చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ పార్టీకి అధికార భాగస్వామ్యం దక్కింది. దీన్ని జీర్ణించుకోలేక డీఎంకే విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని, ప్రజలు స్టాలిన్ సీఎం కావాలని ఓట్లేస్తే.. దాన్ని కాదని విజయ్ పంచన చేరిందని తాజాగా విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా డీఎంకే కాంగ్రెస్‌ను మళ్లీ ఎప్పటికీ నమ్మదని, ఆ పార్టీ జాతీయ నాయకులకు కనీస కృతజ్ఞత, మర్యాద కొరవడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ 5సీట్లు గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణమని, కానీ కొన్ని పదవుల కోసం తమకు చెప్పకుండా పారిపోయారన్నారు. కాంగ్రెస్ ను దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదంటూ పిలుపునిచ్చారు. అలాగే జాతీయ స్దాయిలో బీజేపీ విజయాలకు కాంగ్రెస్ అసమర్థతే కారణమన్నారు.

దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కష్టకాలంలో కాంగ్రెస్ డీఎంకేతో నిలబడిందని, వారు మైనారిటీలో ఉన్నప్పుడు తాము బయట ఉండిపోయామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ గుర్తుచేశారు. ఉదయనిధి మాటలు ఆమోదయోగ్యం కావన్నారు. ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయం, చారిత్రాత్మకంగా తన ఉనికి కోసం పోరాడుతున్న దక్షిణ రాష్ట్రంలో బీజేపీకి పాగా వేయకుండా ఆపడానికేనని ఠాగూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ లౌకిక కూటమికి అండగా నిలిచిందని, కానీ బీజేపీ, డీఎంకే, ఏఐఏడీఎంకేలను కలపమని పిలుపునిస్తోందన్నారు. ఇది తమ సిద్ధాంతానికి విరుద్ధమన్నారు. బీజేపీతో ఎలాంటి అవగాహనను కాంగ్రెస్ సహించదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇండియా కూటమిలో విభేదాలు మరింత తీవ్రమైనట్లయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇండియా కూటమిలోకి డీఎంకే ఉండగానే విజయ్ పార్టీ వచ్చి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే డీఎంకే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పడం ఖాయం.












Click it and Unblock the Notifications