Jessica Head: కొహ్లీ-హెడ్ వివాదంలోకి భార్య, కుటుంబం..! ఆన్ లైన్లో టార్చర్?
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ (Travis Head), అతని భార్య జెస్సికా హెడ్ (Jessica Head) మరోసారి భారత క్రికెట్ అభిమానుల నుండి ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ (Virat Kohli) తో జరిగిన వాగ్వాదం తర్వాత ఈ ఉదంతం చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన తాజా ఐపీఎల్ మ్యాచ్ తర్వాత తమతో పాటు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కొహ్లీ ఫ్యాన్స్ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రైవేట్ సందేశాలు పంపినట్లు జెస్సికా ఆరోపించింది.
వరల్డ్ కప్ తర్వాత జరిగిన వేధింపులు పునరావృతం అయినట్లు అనిపిస్తుందని జెస్సికా ఆస్ట్రేలియా మీడియా సంస్థ 'ది అడ్‌వర్టైజర్'కు చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్లపై మెసేజ్ ల దాడి జరుగుతుండటంతో అప్రమత్తమయ్యానని, కానీ తాము బాగానే ఉన్నాం, కానీ వారు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నారని జెస్సికా వాపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించినప్పుడు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయని జెస్సికా వెల్లడించింది. అప్పట్లో వారి చిన్న కుమార్తెకు కూడా ఆన్‌లైన్‌లో కించపరిచే బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత గౌరవంగా ప్రవర్తించాలని ఆమె అభ్యర్థించింది.

ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరినొకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని జెస్సికా తెలిపింది. రీడల్లో ఉత్సాహం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆట వెనుక నిజమైన వ్యక్తులు, కుటుంబాలు ఉన్నారని గుర్తుంచుకోవాలని కోరింది. ఇది మరింత దయను, ఒకరికొకరు మద్దతునిచ్చేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానని వెల్లడించింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో విరాట్ కొహ్లీ తన అభిమానులకు ఏం చెప్తాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.

తాజాగా జరిగిన ఐపీఎల్ సన్‌రైజర్స్ తో మ్యాచ్ లో.. ఆర్సీబీ ఛేజింగ్ చేస్తున్న సమయంలో, కోహ్లీని మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయమని హెడ్ చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. హెడ్ వ్యాఖ్యకు బదులిస్తూ, స్వయంగా బౌలింగ్ చేయమని కోహ్లీ హెడ్‌ను వ్యంగ్యంగా అడిగాడు. హెడ్ ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. కోహ్లీ అవుట్ అయిన వెంటనే, హెడ్ తిరిగి మాట్లాడుతూ, తనకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పాడు. ఇది కోహ్లీకి నచ్చలేదని అనుకుంటున్నారు. సన్‌రైజర్స్ ఆ మ్యాచ్‌ను 55 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత, అభినందనలు తెలుపుతున్న సమయంలో హెడ్ కోహ్లీతో కరచాలనం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, కోహ్లీ అతడికి స్పందించకుండా, ఇతర ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లతో మాత్రం సాధారణంగా కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది.












Click it and Unblock the Notifications