సానియా ఆటపై క్రీడల మంత్రి పెదవి విరుపు
హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా ఆట తీరుపై క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు పెదవి విరిచారు. దేవాదాయ శాఖ నుంచి వైదొలగి క్రీడలు, సాంస్కృతిక శాఖను చేపట్టిన తర్వాత కూడా ఆయన తన సహజ ధోరణిని వదలలేదు. ఆయన ఆదివారం నాడు క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇదిగో వచ్చె, అదిగో వచ్చె సానియా మీర్జా అన్నారు. ఏమైంది? ఆమె కూడా పోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. క్రీడాకారుల ఆటతీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో హాకీలో వరల్డ్ ఛాంపియన్‌గా ఉండేదని, ఇంత పెద్ద దేశంలో క్రీడాకారులు ఎదగకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
ప్రాధాన్యం లేని శాఖను తనకు కేటాయించారని వస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖను తనకు కేటాయించడం పట్ల తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని ఆయన అన్నారు. తనకు ఆటలు, పాటలు అంటే ఇష్టమని ఆయన అన్నారు. తనకు సంగీతమంటే చాలా ఇష్టమని ఆయన చెప్పారు. ఆటలు కూడా ఆడేవాడినని, రాజకీయాల్లో వచ్చాక అన్ని పోయాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆయన చెణుకులు విసిరారు. ఆయన (చంద్రబాబు) కూడా మా వాడే కదా! అని వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో కూడా క్రీడాస్ఫూర్తి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ముసలివాడికి క్రీడల శాఖను ఇచ్చారని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాదరావు అంటున్నారని, పరుగు పందెంలో శివప్రసాదరావు తనతో పోటీ పడాలని, ఎవరు గెలుస్తారో చూసుకుందామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీల నాయకులది రాజకీయ క్రీడ అన్నారు.












Click it and Unblock the Notifications
