ఐఐయం అధ్యయనంపై అనుమానాలు వద్దు: కొణతాల
విశాఖపట్నం: బెంగుళూర్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐయం)తో ఆర్టీసి పటిష్టతకు జరిపించే అధ్యయనంపై అనుమానాలు అక్కరలేదని రాష్ట్ర వాణిజ్య మంత్రి కొణతాల రామకృష్ణ కార్మిక సంఘాల నాయకులను ఉద్దేశించి అన్నారు. వారు కూడా ఒక సంస్థను సూచిస్తే ఆ సంస్థతో కూడా అధ్యయనం చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండు సంస్థల నివేదికలు వచ్చాక రెండింటిపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.
ఐఐయం ప్రతిష్టాత్మకమైన సంస్థ అని, అది అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాక నివేదికపై చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటామని, ఈ సందర్భంలో అన్ని వర్గాలవారు తమ తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఆర్టీసి పునరుద్ధరణపై రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాటలో నడిపించడానికే ఐఐయంతో అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications