మృతుల సంఖ్య తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం: వైయస్
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో మరణాల విషయంలో తమ లెక్కల్లో తప్పుంటే ఏ శిక్షకైనా సిద్ధమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఏజెన్సీ మరణాలపై తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏజెన్సీలో మలేరియా వల్ల ఏడుగురు మాత్రమే మరణించినట్లు ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల కుటుంబాలకు మూడు నెలల్లోగా దోమతెరలు అందజేస్తామని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో నిమ్స్ తరహా సేవలను అందించే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఏజెన్సీ మరణాలపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, కొన్ని ప్రసార సాధనాలు దానికి వంత పాడుతున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో కన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో తాము ఎక్కువ కార్యక్రమాలు చేపట్టామని, దాన్ని తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామని, అయితే ప్రజలు వాస్తవాలు గుర్తిస్తారని ఆయన అన్నారు. వాతావరణం సరిగా లేనందున తన పాడేరు పర్యటన రద్దయిందని, త్వరలో పర్యటన చేస్తానని ఆయన చెప్పారు.
విశాఖ షిప్‌యార్డు విషయంలో మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఏజెన్సీల్లో పర్యటనకు వెళ్లే ముందు ఆయన కేంద్ర మంత్రి టి. ఆర్. బాలుతో కలిసి విశాఖషిప్‌యార్డులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నులను రద్దు చేస్తే షిప్‌యార్డును పునర్వ్యస్థీకరణ చేపడుతామని కేంద్ర మంత్రి టి. ఆర్. బాలు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పోర్టులు, రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
