వచ్చే బోనాలకు తెలంగాణ రాష్ట్రం: విజయశాంతి
హైదరాబాద్: వచ్చే బోనాల పండుగనాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సినీనటి, తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ అమ్మవారిని ఆమె సోమవారం బోనాల పర్వదినం సందర్భంగా సందర్శించుకున్నారు. వచ్చే బోనాల పండుగకు బంగారు బోనాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని ఆమె అన్నారు. ఆమె ఈ సందర్భంగా బోనాన్ని ఎత్తుకున్నారు. జై తెలంగాణ నినాదాలిచ్చారు. బోనాల పండుగను ప్రభుత్వ పర్వదినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
విజయశాంతి రాక సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారి గుడి వద్ద స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. అయితే పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. విజయశాంతి రాక సందర్భంగా లాల్‌దర్వాజలో స్వల్పంగా తొక్కిసలాట జరిగిందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ దినేష్ రెడ్డి చెప్పారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. పాతబస్తీలో పరిస్థితిని ఆయన పర్యటించి పరిశీలించారు. పాతబస్తీలో బోనాల పండుగ ప్రశాంతంగా జరిగిందని హైదరాబాద్ దినేష్ రెడ్డి చెప్పారు. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదని ఆయన చెప్పారు.
హోం మంత్రి కె. జానారెడ్డి కూడా లాల్‌దర్వాజలోని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వ పర్వదినంగా ప్రకటింపజేయడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
