ఆంధ్రలో యూనిట్ స్థాపనకు ఆసక్తి: వోక్స్ ప్రతినిధి
హైదరాబాద్: తమ కంపెనీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నామని జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్ ప్రతినిధి ఫ్రాంక్ ఎల్బీ చెప్పారు. విశాఖపట్నంలో ప్రాజెక్టును నెలకొల్పే ఉద్దేశం వోక్స్ వ్యాగన్‌కు ఉందా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ప్రాజెక్టు స్థాపనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన సమాధానమిచ్చారు. ఎల్బే సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ముఖ్యమంత్రితో కలిసి ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ను నెలకొల్పడానికి వోక్స్ వ్యాగన్ ఇంకా ఆసక్తి చూపుతోందని ఆయన చెప్పారు.
షూష్టర్ వ్యవహారం వల్ల తాము కూడా నష్టపోయామని ఆయన అన్నారు. షూష్టర్ వ్యవహారం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన నష్టానికి తాము బాధ్యత వహిస్తున్నామని ఆయన చెప్పారు. షూష్టర్ వ్యవహారంపై జర్మనీ సంస్థలు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాయని, ఆ దర్యాప్తు ఏ స్థాయిలో ఉందనేది తనకు తెలియదని ఆయన చెప్పారు. 11 కోట్ల రూపాయల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబి ఐ) విచారణతో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు.
షూష్టర్ వ్యవహారం వల్ల తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వోక్స్ వ్యాగన్ అంగీకరించిందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. వోక్స్ వ్యాగన్ తమ యూనిట్‌ను మన రాష్ట్రంలో నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
