శ్రీలక్ష్మి హత్య కేసులో మనోహర్ నేరం రుజువు
విజయవాడ: శ్రీలక్ష్మి అనే విద్యార్థిని హత్య కేసులో మనోహర్ అనే యువకుడి నేరం రుజువైనట్లు మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చలపతిరావు ప్రకటించారు. మనోహర్ మేనత్త, పిన్నిలు ఉమామహేశ్వరి, వరమ్మలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో తుది తీర్పును న్యాయమూర్తి ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు. తనను ప్రేమించలేదనే కోపంతో మనోహర్ శ్రీలక్ష్మిని విజయవాడలో కళాశాలలోనే దారుణంగా హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కున్నాడు. మనోహర్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు పెద్ద యెత్తున ఆందోళన చేపట్టాయి. శ్రీలక్ష్మిని హత్య చేయడానికి మనోహర్‌కు అతని మేనత్త, పిన్నిలు సహకరించారని కేసు నమోదైంది.
నేరం రుజువైనట్లు ప్రకటించిన అనంతరం న్యాయమూర్తి చలపతిరావు ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా? అని మనోహర్‌ను ప్రశ్నించారు. ఏమీ లేదని మనోహర్ చెప్పాడు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ మనోహర్‌కు ఉరిశిక్ష వేయాలని వాదించారు. భారతదేశంలో ఉరిశిక్షను రద్దు చేయలేదు కాబట్టి మనోహర్‌కు ఉరిశిక్ష వేయడమే న్యాయమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఉరిశిక్ష కూడదని మనోహర్ తరఫు న్యాయవాది చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications
