కాంగ్రెస్ నేతల ప్రమేయం: నానావతి కమీషన్
న్యూఢిల్లీ: 1984 అల్లర్లలో స్థానిక కాంగ్రెస్ నాయకులకు పలువురికి ప్రమేయం ఉందని నానావతి కమీషన్ తేల్చి చెప్పింది. 1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఊచకోతపై విచారణ జరిపిన నానావతి కమీషన్ నివేదికను హోం మంత్రి శివరాజ్ పాటిల్ సోమవారం పార్లమెంటుకు సమర్పించారు. అల్లర్లను స్వర్గీయ రాజీవ్‌గాంధీ గానీ, ఇతర ప్రముఖ నాయకులు గానీ ప్రోత్సహించినట్లు, నిర్వహించినట్లు ఆధారాలు లేవని నానావతి కమీషన్ అభిప్రాయపడింది.
అల్లర్లకు స్థానిక నాయకులు, కార్యకర్తలు కారణమని, వ్యక్తిగత రాజకీయ కారణాలే ఈ దాడులకు కారణమని కమీషన్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర సజ్జన్‌కుమార్, ధరమ్ దాస్ శాస్త్రి, హెచ్.కె.యల్. భగత్‌ల పేర్లను కమీషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు, అప్పటి పోలీసు కమీషనర్ టాండన్‌కు అల్లర్లతో ప్రమేయం ఉందని కమీషన్ అభిప్రాయపడింది. అల్లర్లలో స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర ఏ మాత్రం లేదని కమీషన్ స్పష్టం చేసింది.
సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్‌గాంధీ టెలిఫోన్‌లో అన్నట్లు వచ్చిన ఆరోపణకు సాక్ష్యాధారాలు లేవని కమీషన్ స్పష్టం చేసింది. బాధితులు 100 నెంబర్ టెలిఫోన్ నెంబర్‌పై పోలీసులకు సమాచారం అందించడం కష్టమైనప్పుడు రాజీవ్ గాంధీ జోక్యం చేసుకుని పోలీసు అధికారులను సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారని కమీషన్ వివరించింది. కమీషన్ నివేదికపై చర్చ చేపట్టాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications
