గాంధీభవన్‌ను ముట్టడించిన మాదిగ విద్యార్థులు
హైదరాబాద్: షెడ్యూల్ కులాల ( ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠాన వర్గాన్ని కలవడంపై మాదిగ విద్యార్థి సమాఖ్య భగ్గుమంది. మాదిగ విద్యార్థి సమాఖ్యకు చెందిన కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గాంధీభవన్ ఎందుట బైఠాయించి, ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.
ఆందోళనకారులు గాంధీభవన్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మంత్రులు జె. గీతారెడ్డి, జి. వినోద్, గొల్లపల్లి సూర్యారావులను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీకి పంపించారని మాదిగ విద్యార్థి సమాఖ్య కో ఆర్డినేటర్ ఆరోపించారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి వుంటే ఆ ముగ్గురు మంత్రులను డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
