విశాఖలో 5గురు మావోయిస్టుల లొంగుబాటు
విశాఖపట్నం: ఐదుగురు మావోయిస్టు నక్సలైట్లు సోమవారంనాడు విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) శ్రీనివాసరావు ఎదుట లొంగిపోయారు. ఇందులో ఇద్దరు మావోయిస్టు డిప్యూటీ దళకమాండర్లు ఉన్నారు. మిగతావారు స్పెషల్ గెరిల్లా జోన్ సభ్యులు. అడవిలో తిండికి, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కావడం వల్లనే తాము లొంగిపోతున్నట్లు నక్సలైట్లు చెప్పారు. నిద్ర లేకపోవడం, తిండి సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని వారన్నారు.
లొంగిపోయిన ఐదుగురు నక్సలైట్లకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలేసి ఇస్తున్నట్లు యస్పీ శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లను నిర్లక్ష్యం చేయవద్దని, వారి పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఆ మేరకు తాము పునరావాసానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లొంగిపోయినవారిలో ముగ్గురు మహిళా నక్సలైట్లు వున్నారు.












Click it and Unblock the Notifications
