బాబు జిమ్మిక్కులు మైనారిటీలు నమ్మరు: వైయస్
ఆదిలాబాద్/ నిజామాబాద్: ముస్లిమ్‌లకు కల్పించిన రిజర్వేషన్ల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ నగరబాట నిర్వహించారు. గత 9 ఏళ్లలో చంద్రబాబు ముస్లిమ్‌లకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని, అందుకు ఎవరు అడ్డొచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు జిమ్మిక్కులను మైనారిటీలు విశ్వసించరని ఆయన అన్నారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని చంద్రబాబునాయుడు కూలగొట్టించారని, తాను ముఖ్యమంత్రి నివాసాన్ని నిర్మించారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇందులో ఉంటారని ఆయన అన్నారు. అర్హులైన పేదలందరికీ గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు.
ఎయిడ్ పోస్టుల భర్తీకి బడ్జెట్ కొరత ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయన సోమవారంనాడు నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ నగరబాట చేపట్టారు. ఈ సందర్భంగా టీచర్లు ఆయనను అడ్డుకుని ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఆయన ఎయిడెడ్ పోస్టుల భర్తీకి బడ్జెట్ కొరత ఉందని చెప్పారు.
నిజామాబాద్ నగరబాట సందర్భంగా ముఖ్యమంత్రి పలువురు తమ సమస్యలను వినిపించారు. గీత కార్మికులు ఆయనను చుట్టుముట్టారు. ఆయనను ప్రజలు ప్రశ్నలతో ముంచెత్తారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. నిజామాబాద్ జిల్లాలో 30 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తాము అమలు చేస్తామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలను తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
