సర్దుబాట్లపై ప్రాథమిక చర్చలు పూర్తి: కెకె
హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై ఇతర సెక్యులర్ పార్టీలతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లీస్, సిపిఐ, సిపియంలతో పొత్తులపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అన్ని సెక్యులర్ పార్టీలతో తాము పొత్తు పెట్టుకుంటామని ఆయన అన్నారు.
ఈ నెల 24వ తేదీన జరిగే తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు 25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తాము చేసిన విజ్ఞప్తిని తప్పు పట్టడం టిఆర్‌యస్ నేత ఎ. నరేంద్ర అవగాహనలోపానికి తార్కాణమని ఆయన అన్నారు. మావోయిస్టులపై నిషేధం నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో స్థానిక స్థాయిల్లో సర్దుబాట్లు వుంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావులతో సమావేశమై సర్దుబాట్ల గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు. తమకు, సిపియంకు మద్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌తో స్థూల అవగాహనకు వచ్చి కలిసి పోటీ చేయాలనేది వామపక్షాల లక్ష్యమని ఆయన చెప్పారు. సర్దుబాట్లపై చర్చలకు ఒక వారంలో కొలిక్కి వస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
