తెలంగాణపై కాంగ్రెస్ అనుకుంటే ఎంతసేపు: నరేంద్ర
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠాన తలుచుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయించడం అసాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. అధిష్ఠానవర్గం చెప్తే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయరా అని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాజశేఖర్ రెడ్డికి చెప్ప ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేయించుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో తాము తీర్మానం ప్రతిపాదించబోమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణపై ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాన్ని తాము నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. కమిటీ నివేదిక రావాల్సి ఉందని, అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం వెలువడాల్సి ఉందని, ఈ స్థితిలో హోం మంత్రి శివరాజ్ పాటిల్ అంతకన్నా మించి ఏమీ చెప్పలేరని ఆయన అన్నారు. అవసరమైతే వెంటనే కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయించుకోవచ్చునని ఆయన అన్నారు.
కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడిపై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మీద తమకు నమ్మకం లేదని నరేంద్ర అన్నారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో తాము చెబుతున్నది ప్రభుత్వానికి అర్థమవుతున్నట్లు లేదని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
