పులిచింతలపై వైయస్, బాబు వాదులాట
హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య బుధవారం శాసనసభలో వాగ్యుద్ధయం జరిగింది. పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 40 వేల క్యూసెక్కుల కృష్ణానది జలాలను తరలింపుపై చర్చ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. పులిచింతల ప్రాజెక్టుపై తమ పార్టీ మాత్రమే పూర్తి స్పష్టతతో ఉందని చంద్రబాబునాయుడు అంటే సాగునీటి ప్రాజెక్టులపై గత తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
పులిచింతల ప్రాజెక్టుపై తమకు పూర్తి స్పష్టత ఉన్నందు వల్లనే తమ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచామని, అయితే ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు నిరసన తెలియజేస్తూ కాగితాలు చింపేశారని, కాంగ్రెస్‌వారు రాయలసీమలో జలాల కోసం ఉద్యమం, కోస్తాలో మరో ఉద్యమం చేపట్టారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ ఏవో కారణాలు చెప్పి ప్రాజెక్టులు కట్టలేకపోయామని చంద్రబాబు అంటున్నారని, ఒక్క శాసనసభ్యుడు అడ్డుపడితే ప్రాజెక్టును నిర్మించలేని దయనీయమైన దిక్కుమాలిన స్థితిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉందా అని అన్నారు. "మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ఆయన అడిగారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
