వోక్స్ వ్యాగన్ చెల్లింపులపై అసెంబ్లీలో దుమారం
హైదరాబాద్: జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్ పేరిట వశిష్ట వాహన్‌కు ప్రభుత్వం 11 కోట్ల రూపాయల చెల్లింపుపై బుధవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ప్రభుత్వంపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈ అంశంపై స్వల్ప వ్యవధి కింద చర్చకు అనుమతించాలని, దీనివల్ల అన్ని విషయాలు కూలంకషంగా చర్చించడానికి వీలవుతుందని ఆర్థిక మంత్రి కె. రోశయ్య కోరడంతో అందుకు స్పీకర్ కె. సురేష్ రెడ్డి అనుమతించారు.
ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టవచ్చా, లేదా అని తేల్చి చెప్పాలని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి గానీ, రిజర్వ్ బ్యాంక్ అనుమతిగానీ లేకుండా విదేశీ కంపెనీల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టవచ్చునా అని ఆయన అడిగారు. వశిష్ట వాహన్‌కు డబ్బులు చెల్లింపునకు బాధ్యులైన మంత్రులపై, అధికారులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఆయన అడిగారు. వశిష్టవాహన్‌కు డబ్బులు చెల్లించే ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారా అని ఆయన ప్రశ్నించారు. అవగాహనా పత్రాలపై సంతకాలు చేయకుండా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించవచ్చునా అని ఆయన అడిగారు. ఈ ప్రశ్నలు వేస్తున్న సమయంలో సభలో తీవ్ర దుమారం చెలరేగింది.












Click it and Unblock the Notifications
