తెలంగాణ ప్రాజెక్టులపై అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై గురువారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ గొడవ చోటు చేసుకుంది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఇలా పొడిగించడం సరి కాదని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి పదే పదే చెప్పినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు.
గోదావరి నదిపై ప్రాణహిత ప్రాజెక్టుకు డిసెంబర్‌లో శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు టి. దేవేందర్ గౌడ్ గుర్తు చేస్తూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రశ్నించారు. అటువంటి ప్రాజెక్టు ఏదీ లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి లక్ష్మయ్య చెప్పడంతో టిడిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ముఖ్యమంత్రి ఏదో చెప్పి వుంటారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అంటూ రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని, ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే భయంతోనే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని అన్నారు.
లక్ష్మయ్య మాటలకు తీవ్ర ఆగ్రహం చెందిన టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుంటూ - తెలుగుదేశం పాలనలో కన్నా తాము తెలంగాణ కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేశామని చెప్పారు. మూడు ప్రాంతాలకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసిన నిధుల లెక్కలను చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఆయన అన్నారు. దీనికి టి. దేవేందర్ గౌడ్ తీవ్రంగా అభ్యంతరం చెబుతూ - తెలంగాణ కోసం తాము తక్కువ ఖర్చు చేశామని తేలితే, కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని తేల్చక పోతే తాను రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. టిడిపి సభ్యులు తన పోడియం వద్ద బైఠాయించి ఎంతకీ తన మాట వినకపోవడంతో స్పీకర్ సురేష్ రెడ్డి టీ విరామం కోసం సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications