సుప్రీం తీర్పును అంగీకరించాల్సిందే: బూటా
పాట్నా: శాసనసభను రద్దు చేసి బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని బీహార్ గవర్నర్ బూటా సింగ్ అన్నారు. తనను తొలగించాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డిఎ) డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయన ఆ మాట అన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు అంతిమమని, దాన్ని అందరూ అంగీకరించవలసిందేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు జవాబు దాటవేస్తూ ఆయన కారులో ఎక్కి నేరుగా రాజభవన్‌లోకి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించడానికి ఆయన ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్తారని రాజభవన్ వర్గాలు చెప్పాయి. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, హోం మంత్రి శివరాజ్ పాటిల్‌ను కలిసే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతనే తాను ఏం చేయాలనే విషయంపై బూటా సింగ్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు రాజభవన్ వర్గాలు చెబుతున్నాయి. భూకంప బాధితుల సహాయార్థం వస్తువులను, ఆహార పదార్థాలను తీసికెళ్లే వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఆ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
