ఆర్టీసిపై ప్రభుత్వానిది మొండిపట్టు: సిపిఐ
హైదరాబాద్ ఆర్టీసి కార్మికుల సమస్యల విషయంలో ప్రభుత్వం అనవసరంగా మొండి పట్టుదలతో వ్యవహరిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని మరింత జటిలం చేస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆర్టీసి సమ్మెపై ఎస్మా ప్రయోగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవేనని, అందుకే తాము ఆర్టీసి సమ్మెకు మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు.
ఆర్టీసిపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ యుద్ధం ప్రకటిస్తోందని ఆయన అన్నారు. తీవ్రవాదులతో, నక్సల్స్‌తో చర్చలు జరుపుతామని చెబుతున్న ప్రభుత్వం ఆర్టీసి కార్మికులతో చర్చలు జరపబోమని ప్రకటించడం తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటించిన విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు మర్చిపోయారా అని ఆయన అడిగారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కృష్ణా జలాలను తరలించే 170 నెంబర్ జీవోను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 170 నెంబర్ జీవోను, 69 నెంబర్ జీవోను కలిపి, కొన్ని విషయాలను సవరించి కొత్త జీవో విడుదల చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
