సేకరించిన భూములను ఎక్కడా అమ్మలేదు: వైయస్
హైదరాబాద్: గతంలో చైనా ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మన దేశం, రాష్ట్రం ఆ విధంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన చర్చకు ఆయన గురువారం శాసనసభలో సమాధానమిచ్చారు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మామమనే విమర్శలో నిజం లేదని, ఎక్కడ కూడా ఆ విధంగా జరగలేదని ఆయన చెప్పారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వ భూములను మాత్రమే విక్రయించామని ఆయన చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూముల విక్రయం ద్వారా 700 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇందులో 570 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిందని, మన మీద విశ్వాసంతో ఆ విధమైన పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. మనం నిర్మిస్తున్న రింగ్ రోడ్డు భారతదేశంలో ఎక్కడా లేదని, రింగ్ రోడ్డు నిర్మాణానికి అతి పెద్దగా కసరత్తు చేశామని ఆయన అన్నారు. హైదరాబాద్ చుట్టూ చాలా భూములు సేకరించామని, ప్రాజెక్టుల కోసమే ఆ పని చేశామని ఆయన చెప్పారు. భూమికి భూమి ఇవ్వాలని అడుతున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఇచ్చారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
