వైయస్, నేను మంచి మిత్రులం: విహెచ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. తాను, రాజశేఖర రెడ్డి మంచి మిత్రులమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత ఏడాదిన్నరగా తాము కలిసి మెలసి ఉంటున్నామని ఆయన చెప్పారు. హనుమంతరావు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.
తనకు గతంలో అడగకుండానే పిసిసి అధ్యక్ష పదవిని, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్నందున పిసిసి అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుందనేది ఆలోచించి పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తాను సీనియర్ నాయకుడినని, అందరితో మాట్లాడగలనని, అనుభవం ఉందని, పైగా బలహీన వర్గాలకు చెందినవాడినని, వీటిని పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
