విఇఓ హత్యపై ఆందోళన: ఉద్రిక్తత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామ విఇఓ మహేందర్ రెడ్డి హత్యకు నిరసనగా గ్రామస్థులు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన ఆదివారంనాడు ఉద్రిక్తతకు దారి తీసింది. శవంతో గ్రామస్థులు పోలీసు ఎదుట ధర్నాకు దిగారు. కలెక్టర్, కమీషనర్ వచ్చి సమగ్ర విచారణకు హామీ ఇవ్వాలని డిమాండు చేశారు. ఎసిపిని, సిఐని సస్పెండు చేయాలని కూడా వారు డిమాండు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఒకానొక సందర్భంలో ఆందోళనకారులు పోలీసు స్టేషనులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డిని తానే హత్య చేశానని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుగౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే రాజుగౌడ్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడలేదని, ఈ హత్య వెనక ఇంకా చాలా మంది ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications