వైయస్ వ్యతిరేకిస్తే తెలంగాణ ఆగిపోదు: హర్షకుమార్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటు ఆగిపోదని కాంగ్రెస్ అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి వదిలేశామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే మంచిదని మెజారిటీ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని, దాని వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని, గత పదేళ్ల లెక్కలు తీస్తే ఈ విషయం వెల్లడవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయం మాత్రమేనని, మెజారిటీ పార్లమెంటు సభ్యులు విడిపోవాలనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. డబ్బులు పెడుతూ అవమానాల పాలు కావడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదని, ఆత్మగౌరవం ముఖ్యమని భావిస్తున్నారని, విడిపోతేనే ఆంధ్ర అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పరిస్థితులను పార్టీ అధిష్ఠానవర్గం అంచనా వేస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications