నిరూపించకపోతే రాజకీయాలకు గుడ్ బై: బాబు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వరి కన్నా గోధుమకు మద్దతు ధర పెరిగిందని, ఈ విషయాన్ని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. వరికి మద్దతు ధరపై వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి మంగళవారం ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన శాసనసభలో మాట్లాడారు. వరి రైతులపై కేంద్రప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ప్రశంసిస్తారని ఆయన ప్రశ్నించారు.
వరికి వేయి రూపాయల మద్దతు ధర సాధించలేకపోతే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందుల పర్యటనకు సమయం దాటిపోతుందంటూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. వరికి మద్దతు ధరపై ప్రతిపక్షాల ప్రతినిధులతో ఢిల్లీకి వెళ్లడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. వరికి మద్దతు ధర సాధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ రాష్ట్ర సమితి, సిపియం, బిజెపిలు కూడా విమర్శించాయి.












Click it and Unblock the Notifications
