కెసిఆర్ నిజాం పొగడ్తలు దిగజారుడే: సిపిఐ
విజయవాడ: నిజాం నవాబును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రశంసించడం తెలంగాణ సాయుధ పోరాట వీరులను అవమానించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న నిజాం నవాబును కెసిఆర్ కొనియాడడం అర్థం లేనిదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం యోధులను నిజాం ప్రభుత్వం చంపిందని ఆయన అన్నారు.
నిజాం నవాబును కెసిఆర్ పొగడడం దిగజారుడు తనమని ఆయన అన్నారు. అది దివాళాకోరు రాజకీయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి నిజాం ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాడని, అటువంటి నిజాంను కెసిఆర్ కొనియాడడం సరికాదని, ఈ విషయంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులకు సమాధానం చెప్పే నైతిక ధైర్యం కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
