మజ్జి శ్రీను టీడీపీలో చేరిన వేళ.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా రావులపాలెంలో కోనసీమ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటైంది.
పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం బొత్స మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేయడాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు విస్తృతంగా నిర్వహించాలని, తమ ప్రభుత్వం, ప్రస్తుత పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని, గ్రామాల్లో పార్టీకి ఉన్న పునాదిని మరింత పటిష్టపర్చడానికి ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను గుర్తించాలని తెలిపారు.
పార్టీ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తల గుర్తింపును మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి స్థాయి నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనంతరం చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు వైసీపీ అగ్రనాయకత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
పార్టీలో చిత్తశుద్ధితో పని చేసే ప్రతి ఒక్కరినీ వైఎస్ జగన్ ఆదుకుంటారని తేల్చి చెప్పారు బొత్స. పదవులను అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదని పరోక్షంగా తన మేనల్లుడు మజ్జి శ్రీనును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటువంటి సందర్భంలోనే పార్టీకి, అధినేతకు అండగా నిల్చోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
