చిరు పార్టీ పెడితే ప్రభావం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడితే ప్రభావం ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలపై ఆ ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి)చైర్మనుగా ఆయన బుధవారం పదవీబాధ్యతలు చేపట్టారు. తెలంగాణపై మాట్లాడుతున్నందుననే ఈ పదవి ఇచ్చారనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇది తనకు పెద్ద పదవేం కాదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అడ్డంకి అనే మాటకు తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తన విశ్వాసాన్ని వదులుకోనని ఆయన అన్నారు. తాను గవర్నర్ పదవి ఆశించానని, కొన్ని పరిస్థితుల వల్ల గవర్నర్ పదవి రాలేదని, అయితే తాను ఆశించిన పదవి రాదని అనుకోవద్దని ఆయన అన్నారు. ఆర్టీసి చార్జీలు పెంచే విషయం తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. ఆర్టీసి లాభాల బాటలో నడుస్తోందని ఆయన చెప్పారు. తాను ఇది వరకు ఆర్టీసీ చైర్మనుగా పనిచేశానని, దాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications