ఎన్టీఆర్ పత్రికలు చదివేవారు కారు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వస్తారని ఎవరనుకున్నారని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. ఆర్టీసి చైర్మనుగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన బుధవారం సినీ నటులు రాజకీయ రంగ ప్రవేశంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎన్టీఆర్ పత్రికలు కూడా చదివేవారు కారని, ఎన్టీఆర్ కు ఆ సమయం కూడా ఉండేది కాదని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందినవారే కొంత మంది ఎన్టీ రామారావుతో పార్టీ పెట్టించారని ఆయన అన్నారు.
ఎన్టీ రామారావు ప్రతిరోజూ మూడు గంటలకే లేచేవారని, గంట పాటు ఎక్సర్ సైజు చేసేవారని, ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని మేకప్ వేసుకునేవారని, ఏడు గంటలకు దర్శకుడు, తదితరులతో మాట్టాడేవారని, ఆ తర్వాత షూటింగుకు వెళ్లేవారని, తిరిగి రాత్రి వచ్చి మేకప్ తీసేసుకుని 9 గంటలకే నిద్రపోయేవారని ఆయన వివరించారు. చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని అందరూ అడుగుతున్నారట, వామపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయట, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు ఆయన అన్నారు. నువ్వు కూడా పెట్టవచ్చు, ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాత పార్టీ పెట్టవచ్చు అని ఒక మీడియా ప్రతినిధిని ఉద్దేశించి అన్నారు. జయప్రద ఉత్తరప్రదేశ్ వెళ్లి లోక్ సభకు పోటీ చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications