జుడాలపై ఎస్మా ప్రయోగం: వైయస్
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు రేపు ఉదయం లోగా విధుల్లో చేరకపోతే ఎస్మా లాంటి చట్టాన్ని ప్రయోగించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. విధుల్లో చేరనివారిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని ఆయన మంగళవారం అన్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా తీసుకోబోయే చర్యలకు కారణం జూనియర్ డాక్టర్లే అవుతారని ఆయన అన్నారు. విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్యుల రక్షణకు తాము ఆర్డినెన్స్ తెచ్చామని, ఎంబిబియస్ విద్యార్థులను కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి తెస్తామని ఆయన చెప్పారు.
శాసనసభ్యులను అరెస్టు చేయాలని జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సరి కాదని ఆయన అన్నారు. నీలోఫర్, నయాపూల్ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అనడం కూడా సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేయాడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. నీలోఫర్ ఘటనలో ఇప్పటికే శాసనసభ్యుడు అరెస్టయ్యారని ఆయన చెప్పారు. నయాపూల్ ఘటనతో శాసనసభ్యుడికి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు హక్కులనే కాదు బాధ్యతలను కూడా గుర్తించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications