ఇద్దరు ఆత్మహత్యాయత్నం: కొడుకు మృతి
వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తండ్రీకొడుకులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వీరిలో కొడుకు శివాజీ మరణించగా, తండ్రి మేకల సత్యనారాయణ వరంగల్లులోని ఎజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. శివాజీకి మతిస్తిమితం సరిగా లేదని అంటున్నారు. కలెక్టర్ కలవడానికి నిరాకరించడంతో వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కలెక్టరేట్ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే శివాజీ మరణించాడు.
వరంగల్ జిల్లా గోవిందరావుపేటలో సత్యనారాయణ భార్య యశోద పేరిట రేషన్ షాపు ఉంది. ఈ షాపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అధికారులు డీలర్ షిప్ ను రద్దు చేశారు. దీనిపై వారు ములుగు ఆర్డీవోకు డీలర్ షిప్ పునరుద్ధరించాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ములుగు ఆర్డీవో ఎటూ తేల్చకపోవడంతో జిల్లా కలెక్టరును కలవడానికి వచ్చారు. డీలర్ షిప్ ను పునరుద్ధరించిన విషయం తెలుసుకోకుండా వారు తొందర పడ్డారని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications