మారెప్ప వ్యాఖ్యలు తప్పు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి మారెప్ప వ్యాఖ్యలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి తప్పు పట్టారు. మారెప్ప ప్రకటనలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తాయని ఆయన బుధవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మారెప్పది అనవసరమైన స్పందన అని, మారెప్ప ఆ విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మారెప్ప వ్యాఖ్యలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లానని ఆయన చెప్పారు.
తెలంగాణ అంశం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేతిలో లేదని, అది తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలోనే ఉందని ఆయన అన్నారు. సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ అంటున్నారని, అదే సమయంలో మాట్లాడుతున్నారని, ఇది పార్టీకి కొంత నష్టం చేస్తుందని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీతో తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని పార్టీ నాయకత్వం అనుకుందని, అయితే దాని వల్ల జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఏకాభిప్రాయంతో తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని అనుకుందని, అయితే ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications