తెరాసకే విజయావకాశాలు: కాకా
హైదరాబాద్: రాజీనామాలు చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కే విజయావకాశాలుంటాయని సీనియర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ నెల 24వ తేదీన తెలంగాణ సెంటిమెంటును చాటేందుకు తలపెట్టిన సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ సీనియర్లు శుక్రవారం వెంకటస్వామి నివాసంలో సమావేశమై చర్చించారు. 24వ తేదీన భువనగిరి సభ జరుగుతుందని వెంకటస్వామి చెప్పారు. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తారు.
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడిన విషయంపై వారు సమావేశంలో చర్చించారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సిన అనివార్య స్థితి అన్ని పార్టీల్లోనూ ఏర్పడిందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు సానుకూలంగా తమ పార్టీ అధిష్ఠానవర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, అమోస్, ఎం. సత్యనారాయణరావు, కమలాకరరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications