కుప్పకూలిన గోదాం.. శిథిలాల కింద 40 మంది కార్మికులు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా నగరంలోని తారాతలా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఓ పెద్ద కమర్షియల్ గోదాం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఈప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా కార్మికులు కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కాంక్రీట్ స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం
తారాతలా పరిధిలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ డిపో ప్రాంగణంలో ఈ గోదాం నిర్మాణం జరుగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున కార్మికులు అక్కడ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గోడలు, పైకప్పుకు సంబంధించి భారీ ఇనుప స్ట్రక్చర్లు, కాంక్రీట్ స్లాబ్ వేస్తుండగా.. ఒక్కసారిగా ఆ బరువైన నిర్మాణమంతా కుప్పకూలి కార్మికులపై పడింది. దీంతో అక్కడ ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కొందరిని కాపాడే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్ల సహాయంతో ఇనుప రాడ్లను, కాంక్రీట్ దిమ్మెలను తొలగిస్తూ లోపల ఉన్న వారి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద పెద్ద సంఖ్యలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. శిథిలాల నుంచి బయటకు తీసిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
#WATCH | Kolkata | West Bengal | Search and rescue operation underway at the site where an under-construction godown shed collapsed in Taratala. https://t.co/O68iBSS8Lb pic.twitter.com/rU10750Fnl
— ANI (@ANI) June 24, 2026
వర్షాల వల్లే ప్రమాదమా?
ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఈ పాత లేదా తాత్కాలిక పునాది బలహీనపడి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు నిర్మాణ స్థలంలో కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద వార్త తెలుసుకున్న బీజేపీ నేత రాకేష్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. బాధితులకు సరైన వైద్య సహాయం అందేలా చూడాలని, ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications