వన్డేలకు పూర్వవైభవం: ముక్కోణపు సిరీస్‌లు మళ్లీ వచ్చేస్తోన్నాయ్
క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన వన్డే ముక్కోణపు సిరీస్ లు మళ్లీ తెర మీదికి రాబోతోన్నాయా? అవి పునరుజ్జీవం పోసుకోనున్నాయా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అప్పట్లో భారత్- పాకిస్తాన్- వెస్టిండీస్, భారత్- ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా, భారత్- ఆస్ట్రేలియా- శ్రీలంక ట్రయాంగులర్ సిరీస్ లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. జనం ఎగబడి చూసేవాళ్లు. టీ20 యుగంలోకి అడుగుపెట్టాక వీటికి ఆదరణ తగ్గింది.
ఇప్పుడు మళ్లీ ఈ ట్రై- సిరీస్ లు తెరమీదికి రానున్నాయి. టీమిండియా వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. భవిష్యత్తులో ముక్కోణపు సిరీస్‌లను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ చీఫ్ రిచర్డ్ గౌల్డ్ ప్రకటించారు. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా రానున్న రోజుల్లో కొన్ని వన్డే ముక్కోణపు సిరీస్‌లు ఉంటాయని అన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శుబ్‌మన్ గిల్ వన్డే ఫార్మాట్ గురించి మాట్లాడాడు. 50 ఓవర్ల ఫార్మట్ వరల్డ్ కప్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, దీన్ని 40 ఓవర్లకు కుదించకూడదని సూచించాడు. చిన్నతనంలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌లను ఎంతో ఆసక్తిగా చూసేవాడినని గుర్తు చేసుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే, ఇలా మూడు లేదా నాలుగు దేశాలు పాల్గొనే టోర్నీలు నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
శుబ్‌మన్ గిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై రిచర్డ్ గౌల్డ్ స్పందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని, అయినప్పటికీ- ముక్కోణపు మ్యాచ్ లను నిర్వహించడానికి వెనుకాడబోమని అన్నారు. వన్డే ఫార్మట్‌కు పూర్వ వైభవం తీసుకుని వచ్చే విషయంలో ముక్కోణపు సిరీస్ లు అద్భుతమైన మార్గమని, భవిష్యత్తులో వీటిని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఐసీసీ ప్రతిపాదించిన 2023-2027 ఎఫ్టీపీ ప్లానింగ్ లో ఇప్పటికే కొన్ని ముక్కోణపు సిరీస్‌లను చేర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో కూడిన ముక్కోణపు వన్డే సిరీస్ జరగడం ఇందుకు ఉదాహరణ. ఆగస్టు-సెప్టెంబర్‌లో నమీబియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ట్రై-సిరీస్ షెడ్యూల్ అయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పాకిస్తాన్ మరో ముక్కోణపు వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది.
ఒకే జట్టుతో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ ఆడటం కంటే కూడా వేర్వేరు బలమైన ప్రత్యర్థులతో తలపడే మ్యాచ్ లకు ఉన్న ఆదరణే వేరు. ప్రతి మ్యాచ్ కు కూడా ఆయా జట్లు కూడా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బలబలాలకు అనుగుణంగా జట్టుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌లను కొంతవరకు తగ్గించి, వాటి స్థానంలో ఈ ముక్కోణపు సిరీస్‌లను తీసుకువస్తే వన్డే ఫార్మట్ రక్తి కట్టిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.





Click it and Unblock the Notifications