మోదీ పుట్టినరోజు వేళ 88 లక్షల ప్రమిదలతో వెలుగుల పండుగ! కాశీకి చంద్రబాబు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ రాష్ట్రమంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని 76వ ఏటలోకి అడుగుపెడుతుండటంతో పాటు ఆయన ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. నెల రోజుల పాటు సాగే 'సేవ అండ్ సంకల్ప్ అభియాన్'లో భాగంగా గురువారం సాయంత్రం గుజరాత్‌లోని 18,500 ప్రాంతాల్లో ఒకేసారి ఏకంగా 88 లక్షల ప్రమిదలను వెలిగించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 'ఆశీర్వాద్ నూ దివ్డో' పేరుతో జరుగుతున్న ఈ దీపోత్సవంతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక, శోభాయమాన వాతావరణం సంతరించుకోనుంది.
అహ్మదాబాద్‌లో నేతల సమ్మేళనం..
ఈ ఉత్సవాల్లో అహ్మదాబాద్ నగరం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడి ప్రసిద్ధ కాంకరియా లేక్‌ఫ్రంట్ వద్ద నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతున్నారు. ఈ సరస్సు గట్టు వెంట ఒకేసారి 1.25 లక్షల దీపాలను వెలిగించనుండగా, నగరానికి మకుటాయమానంగా నిలిచే అటల్ బ్రెడ్జ్ వద్ద మరో 76,000 ప్రమిదలతో కాంతులు విరజిమ్మనున్నారు. అంతకంటే ముందు నగరాన్ని శుభ్రంగా ఉంచే 1,000 మంది పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జరిగే సాయంత్రం ఆరతిలో అమిత్ షా, సీఎంతో పాటు మేయర్ హితేష్ బారోట్ పాల్గొననుండటం విశేషం.

దేవాలయాలు, ప్రముఖ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక సందడి
రాష్ట్రవ్యాప్తంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు, భజన సంధ్యలు ప్రారంభం కానున్నాయి. ఆలయాల్లో సాయంత్రం జరిగే మహా హారతి సమయంలో, అంటే సరిగ్గా 7 గంటలకు ఈ 88 లక్షల దీపాలను ఒకేసారి వెలిగిస్తారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అంబాజీ, ఓల్పాడ్, సూరత్, రాజ్‌కోట్ వంటి ప్రముఖ నగరాల్లో రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, యూనియన్ మంత్రులు స్వయంగా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు.
సామాజిక సేవే లక్ష్యంగా విస్తృత ఏర్పాట్లు
కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందించారు. అహ్మదాబాద్‌లోని 48 వార్డులలో 4.8 లక్షల ప్రమిదలు వెలిగించడంతో పాటు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో లక్షలాది మంది ప్రజలు భాగస్వాములయ్యేలా వేలాది స్వచ్ఛంద కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఆయుష్మాన్ భారత్, ఉచిత రేషన్ పంపిణీ, రైతు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోని చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లడమే ఈ నెల రోజుల ప్రచార ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాశీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ముందుగా వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథుడ్ని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవా యాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు.














Click it and Unblock the Notifications
